3, 5 ... వారి ముందరి కాళ్ళకు బంధాలు

 

Congress

  • కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో కొత్త వారికి ప్రతి బంధకంగా మారిన నిబంధనలు
  • పొంగులేటి, తుమ్మల అనుచరులకు మండల, జిల్లా అధ్యక్ష పదవులు దూరమయ్యే అవకాశం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. పార్టీ బూత్ కమిటీల నుండి జిల్లా కమిటీల వరకు ఎన్నికలు నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తల నుండి ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులకు కూడా అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎంత ప్రభావం చూపారు? పార్టీకి వారు ఏ మేరకు ఉపయోగ పడ్డారన్నదాన్ని  ప్రాతిపదికకగా తీసుకొని అభ్యర్ధుల ఎంపిక జరుగుతోంది. ఇందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, పొదెం వీరయ్యలు ముఖ్యనాయకులతో మాట్లాడి ప్రతి నియోజక వర్గానికి ఇద్దరికి తగ్గకుండా ఒక జాబితాను రూపొందిస్తున్నారు. ఈ ప్రతిపాదిత జాబితాను ఈ నెల 12 లోగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కు పంపాల్సి వుంది. అంతే కాకుండా, మండల, జిల్లా కమిటీలకు సంబంధించిన ప్రతిపాదిత జాబితాను కూడా ఈ నెల 15 లోగా పంపాలి. అయితే, ఎవరైనా పార్టీ మండల అధ్యక్షులు కావాలంటే కనీసం 3 సంవత్సరాలు, జిల్లా అధ్యక్షులు కావాలంటే కనీసం 5 సంవత్సరాల నుండి పార్టీలో పని చేస్తూ వుండాలి. ఈ నిబంధనే ఇప్పుడు మండల, జిల్లా అధ్యక్ష్య పదవులు ఆశించే కొత్త వారికి ముందరి కాళ్ళ బంధంగా మారాయి.

ప్రధానంగా ఈ నిబంధనలు ఎవరికి నష్టం ?

గత రెండేళ్ళలో జిల్లాకు చెందిన అనేక మంది వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుండి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అలా పార్టీలో చేరిన వారిలో ప్రస్తుత రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి అనుచరులు కూడా వున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజక వర్గాలకు గాను 7 నియోజక వర్గాల్లో పార్టీలో కొత్తగ చేరిన నేతలే గెలుపొందారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నియోజక వర్గాల్లో మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా కొత్తగా పార్టీలో చేరిన వారి హవానే కనిపిస్తోంది. ఈ తరుణంలో మండల అధ్యక్ష పదవికి 3, జిల్లా అధ్యక్ష్య పదవికి 5 సంవత్సరాలు కనీస అర్హతగా నిర్ణయించడం, కొత్తగా పార్టీలో చేరిన వారికి మింగుడు పడడం లేదు. ఎందుకంటే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన అనుచరులు 2023 జూలై2న ఖమ్మంలో జరిగిన జన గర్జన సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు చేరి 2 సంవత్సరాలైంది. మరో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరులతో 2023 సెప్టంబర్ 16న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరు పార్టీలో చేరి రెండేళ్ళు కూడా పూర్తి కాలేదు. అయితే, పార్టీ నిబంధనల ప్రకారం, పొంగులేటి, తుమ్మల అనుచరులేవరూ పార్టీ మండల, జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడానికి అవకాశం లేదు.

మరి పార్టీ పదవులు ఎవరికిస్తారు ?

ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇంచార్జిగా వచ్చిన సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, మాజీ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు చల్లా వంశీ చంద్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పదేళ్ళ పాటు బీఆర్ఎస్ పాలనలో అనేక ఇబ్బందులు పడి పార్టీని బ్రతికిచ్చిన వారికి సరైన గౌరవం దక్కాలన్నారు. వారి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందుకే, వారికి పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలతో పాటు నగర, మండల కమిటీలను కూడా సమీక్షించి, నిబంధనల మేరకు కొత్త కమిటీలను ఎన్నుకోబోతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్ల అధ్యక్ష పదవులకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కనీసం 3 సంవత్సరాల నుండి పార్టీలో పని చేస్తున్న వారు ఈ పదవులకు దరఖాస్తు చేసుకోవాలని నగర అధ్యక్షులు మహ్మద్ జావెద్, నాగండ్ల దీపక్ చౌదరి స్థానిక నాయకులు, కార్యకర్తలను కోరారు. ఆసక్తి వున్న వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం2 గంటల వరకు తమ ధరఖాస్తులను జిల్లా పార్టీ కార్యాలయంలో తమకు సమర్పించాలని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని డివిజన్ల అధ్యక్ష పదవులకు కూడా పార్టీలో 3 సంవత్సరాలుగా పని చేస్తూ వుండాలని నిబంధన పెట్టడంతో కొత్త వారికి ఆ పదవులు దక్కే అవకాశం లేకుండా పోయింది. ప్రధానంగా ఖమ్మం నియోజక వర్గంలో పార్టీలో చేరి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాని తుమ్మల అనుచరులకు ఈ పదవులు దక్కడం కష్టం. పాలేరు నియోజక వర్గంలో కొత్తగా చేరిన పొంగులేటి అనుచరుల పరిస్తితి కూడా అదే. నామినేటెడ్ పోస్టులకు ఈ నిబంధన లేక పోవడం వల్ల అవి దక్కే అవకాశం వుంది. కానీ ఆ పోస్టులు పరిమితంగానే వుంటాయి. పెద్ద నాయకులకు తప్ప, మిగిలిన వారికి రావు. ఈ నేపధ్యంలో 3, 5 సంవత్సరాల నిబంధన కొత్త వారి ముందరి కాళ్ళ బంధంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.


Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి